మహిళల భద్రతపై వైసీపీ ఆందోళన
కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. మహిళలపై దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ నేతల విమర్శ..
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 21 : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలత రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టామని తెలిపారు. రెండు సంవత్సరాలుగా పాలన వైఫల్యాల కారణంగా మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, మహిళలకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, బాధ్యులపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

