అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో చిక్కుకుని ఊపిరాడక మృతి కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించక విషాదం ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందిన మణికుమార్
తిరువణ్ణామలై, జూలై 26 (వి10టివి): తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి గిరిప్రదక్షిణ మార్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలోని ఇరుకైన "మోక్ష మార్గం"లో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు.
కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వర స్వామి దర్శనం అనంతరం రాత్రి గిరిప్రదక్షిణ చేస్తూ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్న మణికుమార్, గుహ ఆకారంలో ఉన్న ఇరుకైన మార్గంలో ప్రవేశించాడు. అయితే శరీరాకృతి కారణంగా మధ్యలోనే ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు.
కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతోసేపు శ్రమించినా ఆయనను బయటకు తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్న మణికుమార్‌ను అనంతరం తీవ్ర శ్రమతో గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

