పిల్లలతోనే పంక్తి భోజనం చేస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకు కొత్త నిర్వచనం
- ప్రతిరోజూ ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న అల్లపుజా కలెక్టర్ ఎస్. సుహాన్... - భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తున్న జిల్లా అధికారి... - ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకు వినూత్న కార్యక్రమం...
అల్లపుజా, జూలై 23 (వి10టివి): కేరళలోని అల్లపుజా జిల్లా కలెక్టర్ ఎస్. సుహాన్ తన వినూత్న విధానంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతిరోజూ కార్యాలయంలో భోజనం చేయకుండా జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం ఆయన దినచర్యగా మారింది. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వడ్డింపు విధానం, పాఠశాల సౌకర్యాలను స్వయంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.
ఇటీవల నీరుకున్నమ్‌లోని శ్రీ దేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్, ప్రత్యేక ఏర్పాట్లు చేయించకుండా నేరుగా డైనింగ్ హాల్లోకి వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ రోజు అందించిన దోసకాయ కూర, ఆలుగడ్డ కూర, పెరుగును ఇతర విద్యార్థుల మాదిరిగానే తీసుకుని భోజనం చేస్తూ ఆహారం ఎలా ఉందని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఇది ఒకరోజు కార్యక్రమం కాదని, గతంలో వయనాడ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా గిరిజన పాఠశాలల్లో ఇదే విధానాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వల్ల మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగి విద్యార్థుల చేరికలు కూడా గణనీయంగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అల్లపుజాలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్న కలెక్టర్ సుహాన్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారికి మరింత ఆత్మీయత కలుగుతుందని, వారి ఆరోగ్యం, చదువు, పాఠశాల వాతావరణంపై ప్రత్యక్ష అవగాహన పొందేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆకస్మిక తనిఖీలతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉంటూ భోజన నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

