చేపలు కొంటానంటూ మోసం... వృద్ధురాలి బంగారు నానుత్రాడు లాక్కున్న దొంగ అరెస్ట్
చేపల వ్యాపారం చేస్తున్న వృద్ధురాలిని నమ్మించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడు.. రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడు, ద్విచక్ర వాహనం స్వాధీనం.. వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసిన ఏలూరు రూరల్ పోలీసులు..
ఏలూరు క్రైమ్, జూలై 22:
ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న ఓ వృద్ధ మహిళను మోసం చేసి ఆమె మెడలోని బంగారు నానుత్రాడును లాక్కెళ్లిన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ పర్యవేక్షణలో, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ సూచనల మేరకు, ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును ఛేదించింది. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టి మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన అగొల్లు నాగ కార్తీక్ (25)ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి వృద్ధురాలి దృష్టి మళ్లించి మెడలో ఉన్న బంగారు నానుత్రాడును లాక్కొని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నానుత్రాడును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా స్పందించి కేసును ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

