తల్లికి వందనం'తో ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా: ఎమ్మెల్యే బొండా ఉమా
అంగన్వాడీ, హెల్పర్లు, ఆశా, శానిటేషన్ సిబ్బందికి పథకం విస్తరణ చారిత్రాత్మకం.. 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,025.78 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 22 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,025.78 కోట్లను నేరుగా జమ చేయడం సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అందరికీ ఈ పథకం వర్తించడం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో తాను ప్రస్తావించిన అంశంపై స్పందించిన ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కూడా 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బొండా ఉమా తెలిపారు. గతంలో అంగన్వాడీ సిబ్బంది వేతనాల పెంపుతో పాటు ఇప్పుడు సంక్షేమ పథకాన్ని విస్తరించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

అనంతరం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించి, స్వీట్లు అందజేశారు. ప్రభుత్వం అందించిన చీరలను పంపిణీ చేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపించడం తన బాధ్యత అని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, దాసరి ఉదయశ్రీ, బచ్చుల బోస్, ఘంటా కృష్ణమోహన్, పైడి తులసి, పలగాని భాగ్యలక్ష్మి, ఎస్కే గౌసియా, పిరియ జగదాంబ, మోదుగుల తిరుపతమ్మ, వెలగల సురేష్, నాగమణి, బెజ్జం జయపాల్, దొండపాటి సుల్తానా తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

