అమరావతిలో మరో మెగా టెక్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం–పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఎంఓయూ సీఎం చంద్రబాబు సమక్షంలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌కు శ్రీకారం సైబర్ భద్రత, డిజిటల్ మోసాల నివారణకు క్వాంటం టెక్నాలజీ వినియోగం
అమరావతి, జూలై 23 (వి10టివి):
అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం–పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మధ్య క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పీఎన్బీ సీఈఓ & ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
దేశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్న తొలి బ్యాంకుగా పీఎన్బీ నిలిచింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటయ్యే ఈ హబ్ ద్వారా బ్యాంకింగ్ సేవల్లో సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక మోసాలను ముందుగానే గుర్తించే వ్యవస్థలను అభివృద్ధి చేయడం, భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ హబ్ పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది. యువతలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని క్వాంటం, డీప్ టెక్నాలజీలకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంపు, డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో బ్యాంకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. క్వాంటం టెక్నాలజీతో డిజిటల్ లావాదేవీల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు.
పీఎన్బీ సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, వేగవంతంగా, వినియోగదారులకు సులభంగా మార్చేందుకు అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఎన్బీ ఉన్నతాధికారులు, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొన్నారు.

